Wednesday 24 May 2023

హ్రీంకారీ-వామకేశీ Hreemkaari-Vamakesi

 

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

ఏతామాహురవిద్యాం బీజం సంసారవృక్షరాజస్య|

సర్వరసఫలయుతస్య ప్రారబ్ధజలేన దేవి దోహదినః || 

(ఉమాసహస్రము – 4.13)  

 

హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయవర్జితా – బగళాముఖి (4 నామములు)  

 

శక్తిప్రణవమైన హ్రీం బీజము మాయా/లజ్జాబీజము అనగా పరిమితత్వమును ఆపాదించుశక్తి. హ్రీంకారముతో ప్రారంభించిన ఈ నాలుగు నామములు, వాక్కును స్థంభింపజేయు బగళాముఖివిద్య సంబంధము. పరా, పశ్యంతి, మధ్యమ మరియు వైఖరివాక్కులను స్థంభింపజేయుశక్తిని తెలియజేయుటకు వాగ్దేవతలు ఈ నాలుగు నామములు కూర్చినట్లున్నది.

 

రాజరాజార్చితా, రాజ్ఞీ , రమ్యా, రాజీవలోచనా, రంజనీ, రమణీ, రశ్యా, రణత్కింకిణిమేఖలా, రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా, రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా – ఛిన్నమస్త (16 నామములు)

 

మస్తకము సహస్రారాంతర్గత పరమాత్మ సంకేతము. పంచజ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియములద్వారా సహస్రారమునందలి పరమాత్మతో కాకుండా(త్రుంచివేయబడిన మస్తకము), పంచభూతాత్మక ప్రపంచముతో జీవులందు కలుగు విషయాసక్తిని (సంగమించురతీమన్మథులు) అణగద్రొక్కు వజ్రవైరోచనీశక్తి, మస్తకమును చేతిలోపట్టుకున్న రేణుకాదేవి/ఛిన్నమస్త.

సంగమించు రతీమన్మథులు జీవులకు ఇంద్రియవిషయములందేర్పడు తీవ్ర ఆసక్తికి సంకేతము.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే|

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే|| (భగవద్గీత 2.62)

వజ్రాయుధము, ఇంద్రుని ఆయుధము మరియు విశేషమైన రోచనము/ప్రకాశము వైరోచనము, పరమాత్మ సంకేతము. వెన్నుదండము, వజ్రాయుధముల సామ్యము తెలిసినవిషయమేకదా. రతీమన్మథులమీద నిలబడి వెన్నుదండమునందలి పింగళ-సుషుమ్న-ఇడ నాడులందలి రక్తధారలను ఆస్వాదించు ఛిన్నమస్తాదేవి, జీవులందలి ఇంద్రియవిషయాసక్తిని సమూలముగా పెకలించివేయుటద్వారా జీవులను పరమాత్మతో అనుసంధానముజేయు విద్యుచ్ఛక్తికి సంకేతము. రక్తబీజుని రక్తము క్రిందపడకుండా కాలీమాత ఆ రక్కసుని రక్తమును ఇంకిపోవువరకు తాగుట ఎట్లు విషయవాంఛలను సమూలముగా నాశనముజేయుటకు సంకేతమో, అటులనే మస్తకమును ఛేదించగా వచ్చిన మూడు రక్తధారలు, ఢాకిని, ఛిన్నమస్త, వర్ణిని త్రాగుట, మనస్సును పంచభూతాత్మక ఇంద్రియార్థములనుండి సంపూర్ణముగా ఉపసంహరించుటకు సంకేతము.

 

ఇంద్రియనిగ్రహమును దైవీక, ఆసురీగుణముల మధ్య జరుగు పోరాటము/యుద్ధమునకు అన్వయించబడుట తెలిసిన విషయమే. ఈ సందర్భమున ఛిన్నమస్తాదేవి సహస్రనామము(శాక్తాప్రమోదము)లందలి రణోత్కంఠా, రణస్థా, వరారంగప్రదాయినీ, రణజైత్రీ, రణోత్సవా నామములను గమనించవలసినది.

 

వాగ్దేవతలు కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, పంచభూతములు మరియు మనస్సు (రతి – ఆసక్తి, మన్మధుడు – కామము/కోరిక)లకు సంకేతముగా వెరసి పదినారు నామములతో ఛిన్నమస్తావిద్య సంబంధముగా కూర్చినట్లున్నది.

 

కామ్యా, కమకలారూపా, కదంబవనవాసిని, కళ్యాణీ, జగతీకందా, కరుణారససాగరా, కలావతీ, కలాలాపా, కాంతా, కాదంబరీప్రియా త్రిపురసుందరి (10 నామములు)

 

కరుణాతరంగితాక్షియైన లలితామహాత్రిపురసుందరీదేవి, శరీరమను నవావరణ శ్రీచక్రాంతర్గతముగనూ, వెలుపలంతటనూ వ్యాపించిన చైతన్యశక్తి స్వరూపము.  కామకలాస్వరూపమైన సుందరీవిద్యను సూచించునవి ఈ పది నామములు.

 

వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా, విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచలనివాసిని, విధాత్రి, వేదజననీ, విష్ణుమాయావిలాసిని – కాళి  (10 నామములు)

 

క్రమాక్రమాత్మా కాలశ్చ

పరః సంవిది వర్తతే

కాలీ నామ పరాశక్తిః

సైవ దేవస్య గీయతే || (తంత్రలోకః – 6.7)

సైవమ్ సంవిద్వాహిః స్వాత్మ-

గర్భీభూతౌ క్రమాక్రమౌ

స్ఫుటయంతీ ప్రరోహేణ

ప్రాణవృత్తిరితి స్థితా ||  (తంత్రలోకః – 6.8)

 

కాలస్వరూపిణియైన కాలికాశక్తి, విష్ణుసోదరిగా అవతరించిన మాయాశక్తి. ఈ మాయాశక్తి జీవులందు ముఖ్యమైన పది వాయువుల రూపముగా సంచరించుచున్నది. వరదా నుండి విష్ణుమాయావిలాసిని వరకుగల పదినామములు ప్రాణశక్తి స్వరూపిణియైన కాలివిద్య సంబంధితము.

 

క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ, క్షయవృద్ధివినిర్ముక్తా, క్షేత్రపాలసమర్చితా – ధూమవతి (5 నామములు)

 

వివర్ణా చంచలా రూష్టా దీర్ఘా చ మలినామ్బరా|

వివర్ణకుంతలా రూక్షా విధవా విరలద్విజా||

కాకధ్వజరథారూఢా విలంబిత పయోధరా|

సూర్యహస్తాతి రూక్షాక్షీ ధృతహస్తా వరాన్వితా||

ప్రవృద్ధఘోణా తు భృశం కుటిలా కుటిలేక్షణా|

క్షుత్పిపాసార్దితా నిత్యమ్ భయదా కలహప్రియా||

కాకధ్వజరథమునధిరోహించిన వివర్ణ, చంచల, మలినవస్త్రధారిణియైన విధవ, ధూమవతి స్వరూపము. ఇటువంటి శక్తిని, సర్వమంగళయైన లలితామహాత్రిపురసుందరీ నామములందు వాగ్దేవతలు ఏవిధముగాకూర్చారో చూద్దాము.

 

పంచప్రేతాసనము మీద ఆసీనురాలైన తల్లిని పంచప్రేతాసనాసీనా నామమునందు వర్ణించారు వాగ్దేవతలు.  

బ్రహ్మవిష్ణు రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః

ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః

తల్లి త్రిపురసుందరీదేవి ఆసనము, పంచప్రేతములతో జేయబడినది. బ్రహ్మ(సృష్టి), విష్ణు(స్థితి), రుద్ర(సంహారము), ఈశ్వరులను(తిరోధానము) కోళ్ళుగాను, సదాశివుని(అనుగ్రహము) బల్లగానూగల్గిన ఆసనమును అధిరోహించియున్నది అమ్మ లలితామహాత్రిపురసుందరి. (జ్ఞానార్ణవతంత్రము-4వఅధ్యాయము)

 

చిచ్ఛక్తిః చేతనారూపా జడశక్తిర్జడాత్మికా – చేతనత్వముగల్గినవానియందు చిచ్ఛక్తి మరియు జడవస్తువులందు జడశక్తి  

ధూమవతీవిద్యను చైతన్యరహితమైన ఈ ఐదుప్రేతముల అనుబంధితశక్తిగా, ఐదునామములతో వర్ణించారు వాగ్దేవతలు.

 

విజయా, విమలా, వంద్యా, వందారుజనవత్సలా, వాగ్వాదినీ, వామకేశీ – మాతంగి (6 నామములు)  

 

షట్చక్రస్థయైన వాక్సంబంధిత మాతంగీదేవి. మనస్సుతో అనుసంధానింపబడి పరా, పశ్యంతీ, మధ్యమా మరియు వైఖరిగా రూపాంతరముజెంది మూలాధారాది ఆజ్ఞాచక్రపర్యంతముగల షట్చక్రముల  వాక్కు సంబంధిత మాతంగిదేవివిద్యను సూచించునవి ఈ ఆరు నామములు.

 

శరీరమంతటనూ బహిర్గతముగను విశ్వవ్యాపితమైన చైతన్యశక్తి(సుందరి)వలన సృష్టికిమూలమైన అవ్యక్త ఉపాదానశక్తి (కమల) వికసనముజెంది నామ-రూపసంబంధిత ప్రకాశ(భువనేశ్వరి), నాద(తార)శక్తుల అనుసంధానముతో పరాదిచత్వారివాక్కులను అంతర్లీనముగ స్థబ్ధుపరచి (బగళాముఖి) మూలాధారమునందు నిద్రించునది కుండలినీశక్తి (భైరవి). నిద్రించు ఈ కుండలినీశక్తి కారణముగా మనసు, ఇంద్రియములద్వారా ప్రేరేపింపబడి (ఛిన్నమస్త), శరీరమునందు ప్రవహించు ప్రాణశక్తి వాయువు (కాలి) సహాయముతో షట్చక్రములందు రూపాంతరముజెంది (మతంగ) వాక్కురూపముగ బహిర్గతమై సృష్టిస్థిత్యాది పంచకృత్యములు (ధూమవతి) జరుపబడుచున్నవి.

 

ఈ విధముగ దశమహావిద్యాతంత్రములను సంకేతమాత్రము సూచించి, తంత్రము తరువాత వాగ్దేవతలు, తల్లి యంత్రమును వర్ణిస్తున్నారు.

 

ఇకపైనవచ్చు యంత్రసంబంధితనామములను తదుపరి వ్యాసమునందు తెలుసుకుందాము.

 

దశమహావిద్యలకు మూలమైన పరాశక్తిని ప్రార్ధిస్తూ,

 

శ్రీమాత్రేనమః